వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. షర్మిల పాదయాత్రకు ఓకే చెప్పిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గతంలోని షరతులను గుర్తు చేసింది. ఈ షరతులకు అనుగుణంగా పాదయాత్ర ఉండాలని తెలిపింది. షర్మిల తరఫున అడ్వోకేట్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని షరతులు విధిస్తూ అనుమతి జారీ చేసింది. పాదయాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చునని అప్పుడే సూచించింది. అయినప్పటికీ పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో పార్టీ నేతలు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాము అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణను తాలిబన్ రాష్ట్రంగా మారుస్తున్నారని షర్మిల, రాజ్ భవన్ వద్ద తీవ్ర ఆరోపణలు చేసినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. అక్కడ వ్యాఖ్యలు చేస్తే, పాదయాత్రకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించింది హైకోర్టు. హైదరాబాద్లో ఉంటూ రాష్ట్రం గురించి వ్యాఖ్యానించడం సరికాదని, అయినా రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజమేనని అభిప్రాయపడింది. ఇరువైపుల వాదనల అనంతరం షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.