»What Is Siddaramaiahs First Signature As Chief Minister
Siddaramaiah : ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తొలి సంతకం దేనిపై అంటే…!
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి బీజేపీపై వ్యతిరేకతతో పాటు 5 హామీలు కూడా ప్రభావం చూపాయి. ఇవాళ సీఎంగా పదవీప్రమాణం చేసి సిద్ధరామయ్య (Siddaramaiah) 5 హామీలపై తొలి సంతకం చేశారు
కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీల అమలుకు నిర్ణయిస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేశారు. విధాన సౌధ (Vidhana saudha) లో మధ్యాహ్నం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఐదు హామీల అమలుకు సంబంధించి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా రెండో క్యాబినెట్ సమావేశం జరుపుతామని, ఈ వెంటనే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) ఆదేశాలిచ్చిన ఐదు హామీల్లో ‘గృహజ్యోతి (Grihajyothi’) పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తారు. ‘గృహలక్షి పథకం’ కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం.
‘అన్న భాగ్య’ పథకం కింద బీపీఎల్ (BPL) హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా. ‘యువ నిధి’ పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1.500 చొప్పున నెలసరి భృతి అందిస్తారు. ‘ఉచిత ప్రయాణం’ పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు.దీనికి ముందు, కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Sivakumar),మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi)సభావేదిక నుంచి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తామన్నారు, మరో ఒకటి, రెండు గంటల్లో జరిగే తొలి క్యాబినెట్ సమావేశంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.