వేసవి సెలవులు ముగిసాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఓ గ్రామంలో మాత్రం విద్యార్ధులే కాదు టీచర్లు కూడా స్కూల్ కు వెళ్లటానికి జంకుతున్నారు. అది ఒడిశా రైళ్ల ప్రమాదం (Odisha train accident) ఘటన నేపథ్యంలో. అదేంటీ ఈ రైళ్ల ప్రమాదానికి..విద్యార్ధులు బడికి వెళ్లేందుకు భయపడటానికి సంబంధమేంటి? అంటే ఒడిశాలోని బాలసోర్(Balasore) ప్రాంతంలోనే ఈ రైళ్ల ప్రమాదం సంభవించింది అనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈరైళ్ల ప్రమాదంలో వందలమంది మృతి చెందారు. మరెంతోమంది గాయపడ్డారు. ఈ రైళ్ల ప్రమాదంతో బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కానీ ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను అధికారులు బహనాగ హైస్కూలు(Bahanaga High School)లో ఉంచారు. ఈరైళ్ల ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను మరోదారి లేక సమీపంలో ఉండటంతో తాత్కాలికంగా బహనాగ హైస్కూల్ ను శవాగారంగా ఉపయోగించారు.
క్లాసు రూముల్లో మృతదేహాలను ఉంచారు. ఆ తరువాత వాటిని అక్కడ నుంచి తరలించారు. అయినా బడి తిరిగి ప్రారంభమైన క్రమంలో ఈ స్కూల్ (School) కు రావాలంటేనే విద్యార్ధులు వణికిపోతున్నారు. ఇక్కడే కదా ఎన్నో శవాలను పెట్టారు. అక్కడే కూర్చుని పాఠాలు వినాలా? అక్కడే కూర్చుని చదువుకోవాలా? అని పిల్లలు భయపడిపోతున్నారు. విద్యార్ధుల పరిస్థితి ఇలా ఉంటే ఉపాధ్యాయులు (Teachers) కూడా కాస్త భయపడుతున్నారు స్కూల్ కు రావటానికి. స్కూలును, క్లాస్ రూంలను చూస్తే ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతున్నాయని వాపోతున్నారు. స్కూల్ తెరిచిన తర్వాత ఆ క్లాస్ రూముల్లో కూర్చోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా జంకుతున్నారు. గ్రామస్థులంతా ఈ విషయాన్ని జిల్లా అధికారులకు చెప్పుకుని వాపోయారు. ఆ స్కూలు భవనాన్ని కూలగొట్టి కొత్త భవనం నిర్మించాలని స్కూలు కమిటీ విజ్ఞప్తి చేసింది. గ్రామస్థుల అభ్యర్థనకు అధికారులు కూడా సానుకూలంగానే స్పందించారు. స్కూల్ ను కూల్చివేత పనులు ప్రారంభించారు.