దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడితే మరికొన్నింటిలో చినుకు జాడ లేదు. ఈ క్రమంలో నిత్యావసరాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మండిపోతున్న ధరలను చూసిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆ మధ్య టమాటా ధరలు (Tomato Prices) తారా స్థాయికి చేరడంతో కొందరు రైతులు కోట్లు సాధించారు. ప్రజలు మాత్రం లబోదిబోమన్నారు. ప్రస్తుతం టమాటాతో సహా అన్ని కూరగాయల ధరలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే నిత్యావసరాల ధరలు (Essential Commodities) మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. జీలకర్ర, పాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో అకాల వర్షాలు (Heavy Rains) పడ్డాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షం జాడ లేదు. దీని వల్ల వర్షాభావ పరిస్థితుల పరిస్థితులకు పంట దిగుబడిపై తీవ్రం ప్రభావం చూపింది. ప్రస్తుతం కందిపప్పు, బియ్యం (Rice) వంటివాటి ధరలు మండిపోతున్నాయి. కందిపప్పు (Toor Dal) కిలో ధర ఆరునెలల్లోనే 50 శాతం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో రూ.110 ఉండే కందిపప్పు ఇప్పుడు రూ.170లకు చేరింది. ఈ కందిపప్పు మహారాష్ట్ర నుంచి వస్తుంది. అక్కడ వర్షాలు పడకపోవడంతో దిగుబడి తగ్గింది.
ఇకపోతే మినపప్పు రూ.110 నుంచి రూ.130 చేరింది. జీలకర్ర ఆరు నెలల క్రితం రూ.300 ఉండేది. కానీ ఇప్పుడు రూ.700 అయ్యింది. సెనగపప్పు రూ.65 నుంచి రూ.80కి ఎగబాకింది. ఇక పాల ధరలు (Milk Rates) ఐదు రూపాయల చొప్పున పెరిగింది. నాణ్యమైన లీటర్ పాలు ఇప్పుడు రూ.100లు పలుకుతోంది. చింతపండు రూ.120 నుంచి రూ.150కి చేరిపోయింది.
బియ్యం ధరలు (Rice Prices) ప్రజలను భయపెడుతున్నాయి. 25 కిలోల సన్నబియ్యం బస్తా రూ.1250 ఉండగా ఇప్పుడు రూ.1500కు చేరింది. నాణ్యమైన బియ్యం కిలో రూ.64 వరకూ పెరిగిపోయింది. అకాల వర్షాల వల్ల రైతులు దొడ్డు రకం వరి సాగుకు మొగ్గు చూపారు. దీంతో మిగిలిన రకం బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసరాల ధరలు (Essential Commodities) ఇలా పెరిగిపోవడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.