పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.
Supreme Court: పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. బెంగాల్లో 25,743 మంది టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి చోటుచేసుకున్న కుంభకోణంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న తీర్పు వెలువరించింది.
2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదని అందులో తెలిపింది. వెంటనే ఆ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. అయితే ఈ తీర్పును బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు తీర్పునిచ్చింది. వ్యవస్థీకృత మేసమేనని, నియామకాల్లో అవకతవకలు జరిగితే వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే ఇంకా ఏం మిగలదని తెలిపారు. అలాగే ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.