»Special Polling Booth For Five People It Is The Smallest In The Country
Smallest Polling Booth: ఐదుగురి కోసం ప్రత్యేక పోలింగ్ బూత్..దేశంలోనే అతి చిన్నది అదే!
దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. షెరాదండ్ అనే గ్రామంలో కేవలం ఐదుగురి కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008 ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5కి చేరుకుంది. కేవలం 3 గుడిసెలు మాత్రమే ఆ గ్రామంలో ఉండటం విశేషం.
ఓ ఐదుగురి కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ (Polling Booth) ఏర్పాటు కానుంది. దేశంలోనే అతి చిన్నది ఇదే కావడం విశేషం. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని భరత్పూర్ సంహత్ లోని షెరాదండ్ అనే గ్రామంలో ఆ పోలింగ్ బూత్ ఉంది. ఈ గ్రామంలో కేవలం మూడు ఇళ్లు మాత్రమే ఉండగా అందులో ఐదుగురు ఓటర్లు ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 143వ పోలింగ్ బూత్ కావడంతో అక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.
ఆ రాష్ట్రంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీల (Congress Party) మధ్య గట్టి పోటీ అనేది నెలకొంది. దీంతో షెరాదండ్ (Sheraadand) గ్రామానికి సైతం ఎన్నికల ప్రచారం చేయడానికి ఆ పార్టీలు నిశ్చయించుకున్నాయి. 2008లో ఈ షెరాదండ్ గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉండేవారు. అయినప్పటికీ ఆ ఊర్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ తెలియని ఆ చిన్న గ్రామం 2008 ఎన్నికల సమయంలో ప్రపంచానికి తెలిసింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఊరు ఉంది.
షెరాదండ్ గ్రామంలో కేవలం మూడు గుడిసెలు ఉన్నాయి. అందులోని ఓ ఇంట్లో 60 ఏళ్ల మహిపాల్ రామ్ అనే వ్యక్తి ఉన్నారు. ఇంకో ఇంట్లో రాంప్రసాద్ చెర్వా అనే వ్యక్తి, ఆయన భార్య సింగారో, నలుగురు పిల్లలు నివశిస్తున్నారు. మూడో ఇంట్లో దస్రు రాము అనే వ్యక్తి, ఆయన భార్య సుమిత్ర, కూతురు, కొడుకు ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉంటున్నారు. వారిలో ముగ్గురు మగవారు, ఇద్దరు ఆడవారు కావడం విశేషం.
2008 ఎన్నికల్లో ఈ గ్రామంలో గుడిసెలోనే ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం అధికారులు పోలింగ్ కోసం ఓ కాంక్రీట్ భవనాన్ని నిర్మించడం విశేషం. ఎన్నికలకు రెండు రోజులు ముందుగా అక్కడికి పోలింగ్ బృందం వెళ్లి ఓటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ పోలింగ్ జరిగిన ప్రతిసారీ కూడా 100 శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది.