రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తాత సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు రంజిత్ సావర్కర్.
స్వాతంత్ర వీర సావర్కర్ (swatantra veer savarkar) పైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దేశం కోసం ఎంతో కాలం కఠిన కారాగార శిక్ష అనుభవించిన సావర్కర్ (Veer Savarkar) వంటి వ్యక్తిని విమర్శించడాన్ని దాదాపు ఎవరూ జీర్ణించుకోవడం లేదు. కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. సావర్కర్ పైన నోరు జారవద్దని హెచ్చరించారు. ఉద్దవ్ థాకరే వర్గం కీలక నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కూడా ఆ తర్వాత రాహుల్ ను కలిసి, అలాంటి స్వతంత్ర సమరయోధుడిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. సావర్కర్ పైన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యల మీద సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
తన తాత సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు రంజిత్ సావర్కర్. ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. దేశ భక్తుడు.. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో నిరూపించాలని సవాల్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే చూపించాలన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చిన్న పిల్లల వలె ఉన్నాయని, వారు తమ రాజకీయ ప్రచారం కోసం దేశ భక్తుల పేర్లను ఉపయోగించడం దారుణం అన్నారు. దేశ భక్తులను, దేశం కోసం పోరాడిన వారిని మీ రాజకీయాల కోసం వాడుకోవడం పెద్ద నేరం అన్నారు. ఇందుకు గాను రాహుల్ పైన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. సావర్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేదంటే తాను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముస్లీం ఓట్ల కోసం పాకులాడుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని లోకల్ కోర్టులో ఇప్పటికే రాహుల్, సోనియాలపై క్రిమినల్ డిఫేమేషన్ కేసు నమోదు (criminal defamation case against both Rahul Gandhi and Sonia Gandhi) చేసినట్లు చెప్పారు.