చావుకు వెళ్లి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఈ ఘటనలో మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. హర్యానా జింద్‌లో మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను హిస్సార్ జిల్లా బార్వాలా బ్లాక్ ఖర్కడా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పానిపట్‌లోని ఖర్కడ గ్రామానికి చెందిన రాకేశ్ మామ చనిపోయాడు. దీంతో అతను తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి రసూల్పూర్ గ్రామానికి చేరుకున్నాడు.
చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై భార్యా పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ నేపథ్యంలో జింద్ నగరానికి చేరుకోబోతుండగా ఓ టక్కు తమ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న అందరూ రోడ్డుపై పడిపోయారు. అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఎనిమిదేళ్ల షీరత్ అనే బాలిక క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.