కేంద్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ కూడా కోల్పోయిన అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవడం ఎలానో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈ నెల 8-10 మధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలకు ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ పేర్కొంది.
నవంబరు రెండో వారంలో కానీ, లేదంటే డిసెంబరు మొదటి వారంలో కానీ పోలింగ్ జరగొచ్చని పేర్కొంది. 2018 ఎన్నికల్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒక విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. అలాగే గతంలో మాదిరిగానే చత్తీస్గఢ్లో కూడా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎన్నికల తేదీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 10-15 మధ్య ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ, చత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.