2023 – 24 సంవత్సరానికి గాను కేంద్రం ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను సాకారం చేసుకునే బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.
తొలిసారి విశ్మకర్మ అనే పేరుతో బడ్జెట్ లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని.. చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్లు, హస్తకళలు, చేతులతో ఇతర వస్తువులు తయారు చేసే వాళ్ల కోసం పీఎం వికాస్ అనే పథకం ప్రత్యేకంగా తీసుకొచ్చామని, దీని ద్వారా విశ్వకర్మ లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం నుంచి మద్దతు కల్పిస్తామని ప్రధాని వెల్లడించారు.
అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల జీవితాలను బాగు చేయడం కోసం మహిళా స్వయం సంఘాలను ఇంకాస్త మెరుగు పరుస్తున్నామని వాళ్ల కోసం స్పెషల్ సేవింగ్ స్కీమ్ ను తీసుకొస్తామని, మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ బడ్జెట్ లో టెక్నాలజీ, కొత్త ఎకనామీ మీద దృష్టి పెట్టామని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్షరే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే.. మధ్య తరగతి ప్రజల జీవిన విధానాన్ని మరింత మెరుగు పరిచేందుకే టాక్స్ రేట్ ను తగ్గించామని, ఇది వాళ్లకు ఎంతో ఊరట కలిగిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.