PM Modi:ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం తెలంగాణలోని హైదరాబాద్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం తమిళనాడులోని చెన్నైలోని ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కొత్త టెర్మినలన్ ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలో అత్యాధునిక నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఎన్ఐటీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమ, సమాచార శాఖ సహాయ మంత్రి సమక్షంలో దాదాపు రూ.1,260 కోట్ల ఎన్ఐటిబిని ప్రధాని మోదీ ప్రారంభించారు.
చెన్నై టెర్మినల్ ను ప్రారంభించడం వల్ల కనెక్టివిటీ పెరగనుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు మోదీ. ఇదిలా ఉండగా టి-2 (ఫేజ్-1) భవనం విమానాశ్రయ ప్రయాణీకుల సామర్థ్యాన్ని సంవత్సరానికి 23 మిలియన్ల నుండి 35 మిలియన్లకు పెంచుతుందని భావిస్తున్నారు. మొత్తం రూ. 2,437 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త టెర్మినల్ మొదటి దశ పూర్తయింది. ఈ టెర్మినల్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. తమిళనాడులో రోజు రోజుకు విమాన ట్రాఫిక్ పెరుగుతోంది. దీనిని తగ్గించేందుకు కొత్తగా అదనపు టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్ లో 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. 17 ఎలివేటర్లు, 17 ఎస్కలేటర్లు, 06 బ్యాగేజ్ రీక్లెయిమ్ బెల్ట్లు మరిన్ని సౌకర్యాలతో ప్రయాణీకులకు టెర్మినల్ లోపల మంచి అనుభవం కలుగుతుంది.