కేరళ(Kerala)లో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నాది. కోజికోడ్ జిల్లాలో ఆగస్ట్ 30 నుంచి ఇద్దరు మృతి చెందారు. 9 పంచాయితీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నియంత్రణలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరిన్ని చర్యలు చేపట్టింది. తాజా నియంత్రణల్లో భాగంగా కోజికోడ్(Kozhikode)లోని కంటైన్మెంట్ జోన్లలో ప్రార్ధనా స్ధలాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లు (Containment zones) అన్నింటిల్లో ప్రార్ధనా స్ధలాలు సహా అన్ని బహిరంగ కార్యక్రమాలను నిలిపివేయాలని, ప్రజలు గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసరాలను విక్రయించే షాపులు, మందుల షాపులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తారు. కాగా శుక్రవారం ఓ 39 ఏండ్ల వ్యక్తికి నిర్వహించిన పరీక్షలో నిఫా వైరస్ (Nifa virus) పాజిటివ్గ తేలిందని అధికారులు వెల్లడించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూసిన నిఫా వైరస్ (Nifa virus) కేసుల సంఖ్య నాలుగుకు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాక అధికారులు తెలిపారు.కేరళలోని ప్రభావిత ప్రాంతాలకు అనవసర ప్రయాణాలను నివారించడం సహా సరిహద్దు జిల్లాల్లో ఫీవర్ సర్వైలెన్స్ చేపట్టడం వంటి కట్టడి చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య సిబ్బందికి శిక్షణ, అనుమానిత కేసుల కోసం ఆస్పత్రుల్లో పడకలను సిద్ధం చేయడం, తగినన్ని ఔషధాలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడం వంటి వాటిపై దృష్టిసారించాలని సూచించింది. కేరళలోని కోయ్కోడ్ జిల్లాలో నాలుగు నిఫా కేసులు, రెండు మరణాలు సంభవించిన నేపథ్యంలో కర్ణాటక (Karnataka) వైద్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అనుమానితులను క్వారంటైన్ (Quarantine) చేసేందుకు వీలుగా జిల్లా ఆస్పత్రుల్లో కనీసం రెండు పడకలను రిజర్వు చేయాలని, అత్యవసర ఔషధాలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పీపీఈ కిట్లు(PPE kits), శాంపిల్స్ సేకరణ పరికరాలు, అనుమానిత రోగుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లను మార్గదర్శకాల్లో పేర్కొంది. అనుమానిత కేసులను గుర్తిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్లు సంబంధిత జిల్లా వైద్య అధికారికి సమాచారం ఇవ్వాలని తెలిపింది.