ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh)ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కుంభకోణం కేసుకు సంబంధించి ఈ ఉదయం ఎంపీ నివాసంలో ఈడీ (ED) ఇంటిలో తనిఖీలు చేపట్టింది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇంట్లో తనిఖీలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలు ఉన్న బిజినెస్ మెన్ దినేష్ అరోరా(Dinesh Arora)తో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈడీ దాడులను ముందే పసిగట్టిన సంజయ్ సింగ్ ‘ఈడీకి స్వాగతం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Excise Policy) 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణ జరుపుతున్నది.
అయితే, మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ కోసం సీబీఐ (CBI) కి సిఫారు చేశారు. అయితే, కొత్త మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది. పాలసీలో నిబంధనలను ఉల్లంఘించినందుకు, విధానపరమైన అవకతవకలకు పాల్పడ్డారన్న కారణాలతో 15 మంది నిందితులపై సీబీఐ ఆగస్టు 2022లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ తర్వాత దర్యాప్తు చేస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ(Liquor Policy)లో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.