ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సడెన్ గా బండి ఆపాడు. బైక్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న బ్యాగును పట్టుకొని ఫ్లైఓవర్ పక్కకు వెళ్లి అందులో నుంచి నోట్ల కట్టలను తీసి కిందికి వెదజల్లడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక వాహనదారులు తలలు పట్టుకున్నారు. తేరుకొని వెంటనే అతడు చేసే పనిని వీడియో తీయడం ప్రారంభించారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది.
చక్కగా డ్రెస్ వేసుకొని షూ వేసుకొని నల్లని కోటు వేసుకొని ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు డబ్బులు వెదజల్లాడు అనేది తెలియనప్పటికీ.. జనాలు మాత్రం ఆ డబ్బులను ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఫ్లైఓవర్ కు ఇరు వైపుల ఆ వ్యక్తి డబ్బుల కట్టలను కిందికి వెదజల్లాడు. అయితే అవన్నీ 10 రూపాయల నోట్ల కట్టలు. దాదాపుగా రూ.3000 విలువైన నోట్ల కట్టలను ఆయన కిందికి విసిరేసినట్టు అక్కడున్న స్థానికులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకునే లోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కేఆర్ మార్కెట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీద జరిగింది. అయితే.. ఆ వ్యక్తి డబ్బులు విసురుతుండగా కొందరు వాహనదారులు తమ వాహనాలు ఆపి అతడిని డబ్బులు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ.. అతడు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా అన్ని నోట్లను కిందికి విసిరేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.