మోర్బి జిల్లాలో ఇటీవల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా… ఈ నిందితులకు బార్ సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. నిందితుల తరపున తాము వాదించమంటూ న్యాయవాదులంతా తేల్చి చెప్పడం గమనార్హం.
తమ లాయర్లు వీరి తరఫున వాదించబోరని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోట్ బార్ అసోసియేషన్ తీర్మానాలను ఆమోదించినట్టు మోర్బీ న్యాయవాదుల సంఘం సీనియర్ అడ్వొకేట్ ఏ.సి. ప్రజాపతి తెలిపారు.
మచ్చూనదిపై కేబుల్ బ్రిడ్జి నిర్వహణా బాధ్యతలను అహ్మదాబాద్ లోని ఒరెవా సంస్థ చూస్తూ వచ్చింది. అయితే నాసిరకంగా మరమ్మతు పనులు చేసిన కారణంగానే బ్రిడ్జి కూలిందని వార్తలు వచ్చాయి. వంతెన ఫ్లోర్ పై మరమ్మతు పనులు చేబట్టినప్పటికీ కేబుల్ ని అలాగే వదిలివేశారని.. ఈ కారణంగా కేబుల్ తెగిపోయిందని నిన్న ప్రాసిక్యూషన్ వర్గాలు కోర్టుకు తెలిపాయి.
సుమారు ఎనిమిది నెలలుగా మూసి ఉన్న ఈ బ్రిడ్జిని ఒరేవా గ్రూపు ఎండీ జైసుఖ్ పటేల్.. అక్టోబరు 26 న ప్రారంభించారు. మరమ్మతు పనులకు తమ సంస్థ 2 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన చెప్పారు. కానీ ఓపెన్ చేసిన నాలుగు రోజులకే వంతెన కూలిపోయింది.
బ్రిడ్జిని ప్రారంభించే ముందు ఎన్నో లోపాలను గుర్తించి ఉంటే ఈ ఘోర దుర్ఘటన జరిగి ఉండేది కాదని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. రిపేర్లు చేసిన కాంట్రాక్టర్లు క్వాలిఫై అయినవారు కారని, కొత్త కేబుల్ వేయకుండా పాత కేబుల్ ని అలాగే ఉంచేశారని, కలపతో ఉన్న ఫ్లోరింగ్ కి మాత్రమే మర్మతు జరిగిందని వారు వివరించారు. ముప్పు పొంచి ఉంటుందన్న అంచనా ఏ మాత్రం లేకుండా అక్కడ రక్షణ కిట్ల వంటి సాధనాలు కూడా ఏవీ లేవన్నారు. తమ నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.