Air Taxis : రెండేళ్లలో భారత్‌లో ఇండిగో ఎయిర్ ట్యాక్సీలు!
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్‌లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
IndiGo Air Taxis : వచ్చే 2026 నాటికి భారత్ లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడి వేగంగా గమ్యాలకు చేరుకోవాలని అనుకున్నప్పుడు ఈ ట్యాక్సీలను మనం బుక్ చేసుకోవచ్చు. సాధారణ ట్యాక్సీలో ప్రయాణించిన దాని కంటే ఈ ఎయిర్ ట్యాక్సీలో(Air Taxi) ప్రయాణించినప్పుడు మరో 500 రూపాయల వరకు అదనంగా ఛార్జ్ అవుతుందని సంస్థ తెలిపింది.
ఈ ఎయిర్ ట్యాక్సీలను తీసుకు వచ్చేందుకు ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అమెరికాలోని ‘ఆర్చర్ ఏవియేషన్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు భాగస్వామ్యంలో ఎయిర్ ట్యాక్సీలు(Air Taxis) భారత గగనంలో సేవలు అందించనున్నాయి. తొలుత వీటిని దిల్లీలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. దిల్లీలోని కన్నాట్ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కారులో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుంది. అదే ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా ఏడు నిమిషాల లోపలే చేరుకోవచ్చు. ఈ ప్రయాణానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు టికెట్టు ధర ఉంటుంది.
ఇండిగో(Indigo) మాతృ సంస్థకు అమెరికన్ కంపెనీ అయిన ఆర్చర్ ఏవియేషన్ 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలను సరఫరా చేయనుంది. అవే రానున్న కాలంలో భారత్‌లో ఎయిర్ ట్యాక్సీలుగా తిరగనున్నాయి. ఈ చిన్న విమానాల్లో నలుగురు వరకు ప్రయాణించవచ్చు. హెలీకాఫ్టర్ కంటే దీనిలో సెక్యూరిటీ అధికంగా ఉంటుంది. 200 ఎయిర్ ట్యాక్సీ(Air Taxi) విమానాల ధర దాదాపుగా బిలియన్ డాలర్లట.