Maldives : మాల్దీవుల నుండి తిరిగి వచ్చిన భారత సైనికులు.. ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడ్డట్లేనా?
భారతదేశం, మాల్దీవుల మధ్య దాదాపు ఆరు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇండియాకు తన మొదటి అధికారిక పర్యటన చేస్తున్నారు.
Maldives : భారతదేశం, మాల్దీవుల మధ్య దాదాపు ఆరు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇండియాకు తన మొదటి అధికారిక పర్యటన చేస్తున్నారు. తన పర్యటన సందర్భంగా మాల్దీవుల్లో మోహరించిన చివరి బ్యాచ్ భారత సైనికులను వెనక్కి పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి హీనా వలీద్ తెలిపారు. అయితే, భారత సైనికుల సంఖ్య ఎంతన్నది మాత్రం ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. తన ఎన్నికల ప్రచారంలో మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల గడ్డపై భారత సైన్యం మోహరింపును నిలిపివేస్తానని హామీ ఇచ్చారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా ఉపసంహరించుకోవడానికి మే 10 వరకు సమయం ఉంది. ఆ తర్వాత భారత సైనికులందరూ నేడు(శుక్రవారం) స్వదేశానికి చేరుకున్నారు.
మాల్దీవుల్లో భారత సైనికులను ఎందుకు మోహరించారు?
భారతదేశం బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలను నిర్వహించడానికి మాల్దీవులలో భారతీయ సైనిక సిబ్బందిని నియమించారు. చైనా మద్దతు ఉన్న ప్రభుత్వంగా భావించే మాల్దీవుల కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత సైన్యాన్ని మోహరించడంపై వ్యతిరేకత వ్యక్తం చేసి వారిని వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం 51 మంది సైనికులను భారత్‌కు వెనక్కి పంపినట్లు మాల్దీవుల ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారిక పత్రాలను ఉటంకిస్తూ మాల్దీవుల్లో 89 మంది భారతీయ సైనికులు ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
స్పందించిన భారత్
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మొదటి, రెండవ బ్యాచ్ భారతీయ సిబ్బంది భారతదేశానికి తిరిగి వచ్చారని.. మూడు భారతీయ విమానయాన ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించడానికి “భారతీయ సాంకేతిక సిబ్బందిని ఇప్పుడు నియమించారు” అని చెప్పారు.