»India Alliance Meeting Ended Kharge As Prime Ministerial Candidate
India Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా ఖర్గే!
ఢిల్లీలో మూడు గంటలకు పైగా ఇండియా కూటమి నేతలు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిపై కూడా ప్రధానంగా చర్చలు జరిపి తమ ప్రతిపాదనలను తెలియజేశారు.
ఇండియా కూటమి సమావేశం నేడు ఢిల్లీలో వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇండియా కూటమి నేతలు ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత కూడా ప్రతిపాదించారు. మమత ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమర్ధించగా మిగిలినవారు కూడా సమ్మతి తెలిపారు. అయితే ముందుగా ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత ప్రధాని అభ్యర్ధిపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు, బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రణాళికలపై నేతలు చర్చలు జరిపారు. మూడు గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశంలో 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై కూడా నేతలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. సమావేశానికి 28 పార్టీలు వరకూ హాజరయ్యాయి. కాగా ఇండియా కూటమి నేతలు ఇలా సమావేశం కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం.