నేపాల్‌లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నేపాల్‌లోని జాజర్కోట్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్‌క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది. జాజర్కోట్ (Jajarkot) జిల్లాలోని లామిదండా (Lamidanda) ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 128 కిపైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ (Communication) తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. కాగా, భూకంప ప్రభావం ఢిల్లీతో పాటూ ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. భూకంపం (Earthquake) రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు వెల్లడించారు. ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ (Nepal) ప్రభుత్వం అత్యవసర, విపత్తు నిర్వహణ సిబ్బంది, భద్రతా దళాలను రంగంలోకి దింపింది. భారత భూఫలకం, యూరేసియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండటంతో ఇక్కడ భూకంపాలు నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.