నిరుపేద కుటుంబం పుట్టి ఓ యువతి ఉన్నత శిఖరం చేరింది. పట్టుదలతో కష్టపడి చదివి జడ్జి అయ్యింది. అది కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మారి యువతకు ఆదర్శమైంది. ఓ నిరుపేద కూతురు గాయత్రి 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు ఉంది. ఆ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్లైన్లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన నారాయణసామి-వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె ఎన్.గాయత్రి హాజరైంది. కోర్టు సివిల్ జడ్జి పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదల చేయగా బంగారుపేటకు చెందిన గాయత్రి ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే ఆమె హైకోర్టు సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టనుంది. చిన్న వయసులోనే ఆమె హైకోర్టు సివిల్ జడ్జిగా ఎంపికై చరిత్ర సృష్టించింది.
బంగారుపేట సమీపంలోని యళబుర్గికి చెందిన గాయత్రి స్థానిక కరహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసి కేజీఎఫ్‌లోని కెంగల్ హనుమంతయ్య కాలేజీలో 2021 లో లా పూర్తి చేసింది. యూనివర్సిటీ స్థాయిలో 4వ ర్యాంకు సాధించి ఇప్పుడు సివిల్ జడ్జి పోస్టును సాధించింది. అట్టడుగు వర్గానికి చెందిన గాయత్రి కష్టపడి ఈరోజు సివిల్ జడ్జిగా ఎంపికై ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
తన తల్లిదండ్రులు నారాయణస్వామి, వెంకట రత్నమ్మలు రోజువారి కూలి పనులకు వెళ్లి బతుకుతారు. అలా కూలి పనుల నుంచి వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే వారు కూతుర్ని చదివించారు. తల్లిదండ్రుల తపనను కష్టాన్ని అర్ధం చేసుకున్న గాయత్రి కష్టపడి చదివి 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పదవిని చేపట్టనుంది. ఓ దినసరి కూలి కూతురు నేడు న్యాయమూర్తి కావడంతో అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.