»Good News For Railway Passengers 620 Special Trains For Dasara
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు
దసరా పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడపనుంది. అక్టోబర్ 20వ తేది నుంచి 29వ తేది వరకూ దాదాపు 620 ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు (Dasara Holidays) ఇచ్చేశారు. ఉపాధి కోసం సొంతూరును వదిలిన వారంతా దసరా సందర్భంగా తమ ఊర్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా సొంతూర్లకు వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారంతా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటూ ఉంటారు. పండగ వల్ల రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే సీట్లన్నీ బుక్ చేసుకుని ఉంటారు. దీంతో మిగిలిన వారు ప్రయాణం చేయడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) దసరా సందర్భంగా 620 ప్రత్యేక రైళ్లను (Special Trains) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దసరా రద్దీని నివారించేందుకు ఈ స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ (Telangana)లోని కాచిగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 20వ తేది నుంచి 29వ తేది వరకూ ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది.