పీచు మిఠాయి తయారీ, అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం తాజాగా నిషేధించింది. పీచు మిఠాయి తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
Cotton Candy: పీచు మిఠాయిని ఇష్టపడని పిల్లలు ఉండరు. పబ్లిక్ ఏరియాలు, పార్కులు, ఎగ్జిబిషన్లలో వీటి అమ్మకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే పీచు మిఠాయి తయారీ, అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం తాజాగా నిషేధించింది. పీచు మిఠాయి తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం ఉపయోగిస్తున్న ఈ రసాయనం కిడ్నీ, లివర్‌పై ప్రభావం చూపిస్తుందని, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని అధికారులు నిర్ధారించారు. దీంతో పీచు మిఠాయి తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించారు. చెన్నై వ్యాప్తంగా నమూనాలు సేకరించి చేపట్టిన అధ్యయనంలో రోడమైన్-బి అనే కెమికల్ వాడుతున్నారని తేలినట్టు చెప్పారు. టెక్స్‌టైల్స్‌లో ‘డై’ కోసం ఈ కెమికల్ కాంపౌండ్‌ను వాడుతుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఇప్పటికే పీచుమిఠాయిపై నిషేధం విధించారు.