»Congress Congress Partys National Representative Resigned
Congress: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా!
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అలాగే సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏ దిశకు వెళ్తుందో తెలియడం లేదని, క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిన్నదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తను నినాదాలు చేయలేనని తెలిపారు.
సంపద సృష్టికర్తలను నిందించలేనన్నారు. పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బాగా దెబ్బతిన్నదని, కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్‌ను పూరించడం కష్టంగా మారిందని తెలిపారు. కింద స్థాయిలో ఉన్న వాళ్లు తమ నాయకులకు సలహాలు ఇవ్వలేనప్పుడు ఎలాంటి సానుకూల మార్పు సాధ్యం కాదన్నారు.
మహారాష్ట్రలో శివసేన వర్గంతో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత సంజయ్ నిరుపమ్‌పై కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీకి రాజీనామా లేఖను పంపిన తర్వాతే చర్యలు తీసుకొన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ ఈమెయిల్ కాపీ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.