తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఇరువర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది. మాణిక్కం ఠాకూర్ తొలగింపుకు రేవంత్‌కు అనుకూలంగా ఉన్నారనే ఒక్క కారణమే కాదని, మరిన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆయన ఇంచార్జిగా వచ్చి రెండేళ్లు దాటింది. ఆయన నియామకంపై సీనియర్ నేతలు మొదటి నుండి అసంతృప్తిగానే ఉన్నారు. రేవంత్ అధ్యక్షుడయ్యాక ఈ అసంతృప్తి మరింత పెరిగింది. ఆయన ఇంచార్జిగా ఉన్న ఈ రెండేళ్ల పైకాలంలో హుజురాబాద్ నుండి మునుగోడు వరకు పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. ఇప్పుడు మాణిక్ రావు ఠాక్రేను నియమించారు.
ఆయన ముందు ఎన్నో సవాళ్లున్నాయి. 2019 వరకు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే కనిపించింది. కానీ ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కారణాలు ఏవైనా మాణిక్కం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ క్రమంగా బలహీనపడిందనే చెప్పవచ్చు. రేవంత్ అధ్యక్షుడయ్యాక పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించినప్పటికీ, ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఘోర పరాజయం తప్పలేదు. ఇదే కాలంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో పునరుత్తేజం తేవడంతో పాటు ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విబేధాలను పరిష్కరించాల్సి ఉంది. కొద్ది సమయంలోనే ఎన్నో సవాళ్లు ఆయన ముందు ఉన్నాయి.
అయితే మాణిక్కం ఠాకూర్‌ను తప్పించడం వెనుక రేవంత్‌కు అనుకూలంగా పని చేస్తున్నారనే ఒక కారణమే కాదని, మరో కీలకమైన అంశం ఉందని అంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ఒంటరిగా ముందుకు సాగితే గెలుపు పక్కన పెడితే, రెండో స్థానానికి రావడమే కష్టమని పార్టీలోని సీనియర్లు ఆందోళన చెందుతున్నారట. దీనికి తోడు రేవంత్ ఒంటెత్తు పోకడలు వారికి రుచించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తుకు వారు మొగ్గు చూపారని, అధికార పార్టీతో పొత్తు కుదుర్చుకొని, నలభై సీట్లు అడగాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి. రేవంత్ మాత్రం పొత్తుకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్తో కలిసి పోటీ చేద్దామని, ఓ వర్గం, వద్దని రేవంత్ వర్గం మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఇలా ప్రతి అంశంపై రెండు వర్గాల మధ్య పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో మాణిక్కం ఠాకూర్ చేతులెత్తేశారని సమాచారం.
అయితే ఇక్కడ ఓ ప్రశ్న ఉదయిస్తోంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తొలగించిన కారణంగా, కాంగ్రెస్ అధిష్టనం బీఆర్ఎస్తో పొత్తును కోరుకుంటుందా? లేక రేవంత్ రెడ్డి మాట విని పొత్తుకు దూరంగా ఉంటుందా? తెలియాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ఈ పొత్తుకు సంబంధించిన చర్చలు కాంగ్రెస్ అంతర్గతంగానే జరిగాయని, బీఆర్ఎస్ వరకు వెళ్లలేదట. అదే సమయంలో 2014లో కేసీఆర్‌తో అనుభవం దృష్ట్యా, అలాగే దూకుడైన నేత రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నందున పొత్తు అవసరం లేదని కూడా కాంగ్రెస్ భావిస్తుండవచ్చునని అంటున్నారు.