కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాదయాత్రలో పాల్గోన్నారు. జోడో యాత్ర దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు. దేశ ప్రతిష్ఠ గురించి తాను ఆందోళన చెందుతున్నానని, అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని అన్నారు. వ్యక్తిగత కీర్తి కోసం తాము ఈ యాత్రలో పాల్గొనడం లేదని, దేశ ప్రతిష్ఠ కోసమే పాల్గొంటున్నామని వ్యాఖ్యానించారు.
ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించింది వ్యక్తిగత కారణాల వల్ల కాదని, దేశంలో మతపర ఆందోళనలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ యాత్ర ప్రారంభించారని ఆయన అన్నారు. జోడో యాత్ర మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఆ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటూ రాహుల్ కు మద్దతు తెలిపారు.