భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తమ ఇన్‌ట్రాన్సల్ కోవిడ్ 19 వ్యాక్సీన్ ఇన్కోవాక్(iNCOVACC) డోస్ ధరను రూ.800గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. అయితే ఇది ప్రయివేటు మార్కెట్ ధర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డోస్ ధర రూ.325గా పేర్కొంది. దీనిపై 5 శాతం జీఎస్టీ ఉంటే కనుక డోస్ ధర రూ.150 పెరిగి ప్రయివేట్ మార్కెట్లో రూ.1000 వరకు చేరుకుంటుందని పేర్కొంది.
ఈ వ్యాక్సీన్ కోవిన్ యాప్ ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉందని పేర్కొంది. ముక్కు ద్వారా తీసుకునే ఈ వ్యాక్సీన్ జనవరి 2023 నాలుగో వారంలో మార్కెట్లో బూస్టర్ డోస్‌గా అందుబాటులోకి రానుంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారు కోవాక్సిన్, కోవిషీల్డ్ మాదిరి రెండు డోస్‌లు వేసుకోవాలని తెలిపింది. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీనిని ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, కరోనాపై పోరులో ఇది చాలా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రపంచంలోనే రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొదటి ప్రాథమిక వ్యాక్సీన్ కూడా ఇదేనని భారత్ బయోటెక్ తెలిపింది.