అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ ఆరువందల మంది వరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం. అలాగే భారత్కు చెందిన మూడు యూనిట్లు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది.
చైనీస్ ఆర్మీ భారత భూభాగంలోకి పెట్రోలింగ్ కోసం వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ప్రాంత సరిహద్దుల్లో ఘర్షణలు ఇదే తొలిసారి కాదు. 2021 చివరలోను ఘర్షణ పడ్డాయి. గత కొద్దికాలంగా చైనా సైన్యం భారీ సంఖ్యలో ఆర్మీని పెట్రోలింగ్ కోసం పంపిస్తోంది. పెట్రోలింగ్ చేసే ప్రదేశాలు తమ దేశానికి చెందినవే అని చెప్పేందుకు ఇలా చేస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమ భాగంలో ఎక్కువ చొరబాట్లు చోటు చేసుకున్నాయి. అయితే మధ్య, తూర్పు సెక్టార్లలో కూడా ఇటీవల కాలంలో క్రమంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాధీన రేఖ లడక్ (పశ్చిమ), హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ (మధ్య), సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్(తూర్పు) సెక్టార్లుగా పేర్కొంటారు.
ఈ ఘటనపై విపక్షాలు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ ఘటనపై అప్పుడే ఎందుకు దేశ ప్రజలకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కాంగ్రెస్ లోకసభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు.