మహేష్(Mahesh)-త్రివిక్రమ్(Trivikram) మధ్య ఏదో జరుగుతోందనే న్యూస్.. న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవడానికి దాదాపు 12 ఏళ్ల సమయం పట్టింది. అయితే ఎస్ఎస్ఎంబీ28(ssmb28) అనౌన్స్ చేసిన తర్వాత కూడా.. సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకుంది. ఇక షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత.. ఫస్ట్ షెడ్యూల్ అలా అయిందో లేదో.. వెంటనే బ్రేక్ ఇచ్చేశారు. మధ్యలో మహేష్ బాబు తల్లి మరణించడం.. ఆ పైన మహేష్ లండన్ వెళ్లడంతో.. ఇప్పటి వరకు సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టలేదు. దాంతో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే రీసెంట్గా మహేష్ లండన్ నుంచి తిరిగి రావడంతో.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయినా కూడా మహేష్-త్రివిక్రమ్ మధ్య విభేధాలు వచ్చినట్టు తెగ ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. మహేష్‌కు ఫైనల్ స్క్రిప్ట్ పూర్తిగా నచ్చలేదని.. ఫస్ట్ షెడ్యూల్లో ఒక ఫైట్ పూర్తి అయ్యాక కొన్ని కీలక మార్పులు కోరారని.. అందుకే బ్రేక్ ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతునే ఉంది.
దాంతో త్వరలోనే త్రివిక్రమ్.. మహేష్‌కు ఫైనల్ డ్రాప్ట్‌ని నరేట్ చేయబోతున్నాడట. అది మహేష్‌కు నచ్చితే SSMB28 సెట్స్ పైకి వెళ్తుంది.. లేదంటే లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కానీ ఇందులో నిజముందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నామని చెబుతునే ఉన్నారు. ఏదేమైనా.. మహేష్-త్రివిక్రమ్ మధ్య ఏం జరుగుతుందనేది వాళ్లకే తెలియాలి.