ఓటీటీ (OTT) అనేది ఇప్పుడు సినిమా థియేటర్ల (Movie Theatres) కన్నా పాపులర్ అయిపోయింది. అరచేతిలోనే సినిమాను చూసే అవకాశం ఉండడం.. ఎక్కడైనా వీలు చిక్కిన సమయంలో వీక్షించే (Viewing) సౌకర్యం లభించడంతో ప్రజలు ఐటీటీ బాట పడుతున్నారు. అయితే ప్రజల ఆదరణ చూసిన ఓటీటీ సంస్థలు తమ కంటెంట్ (Content)ను ఎలాంటి పరిమితులు లేకుండా యథేచ్చగా విడుదల చేస్తున్నాయి. అసభ్యత, బూతులు, మద్యపానం, ధూమపానం వంటి ఆంక్షలు ఏమీ లేకుండా కంటెంట్ ను వదులుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో విడుదలైన ‘రానా నాయుడు’ (Rana Naidu)పై తీవ్ర దుమారం రేగుతోంది. అందులో ఉన్న కంటెంట్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు ఆ సిరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి (VijayaShanthi), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తదితరులు ఈ సిరీస్ పై మండిపడ్డారు.
‘ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై…”It needs Strict Censoring for ott platform”… అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు. ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను ’ అని విజయశాంతి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అంటే ఓటీటీకి సెన్సార్ ఉండాలని విజయశాంతి డిమాండ్ చేస్తున్నారు.
‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న రామా నాయుడు, మీర్జాపూర్ సిరీస్ లను రద్దు చేయాలి. మంచి కుటుం చిత్రాలను అందించిన దగ్గుబాటు రామా నాయుడు కుటుంబసభ్యుల నుంచి ఇలాంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరం. ఓటీటీ ప్లాట్ ఫామ్ ను తక్షణమే సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా’ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఓ లేఖ విడుదల చేశారు.
ఇలా రామా నాయుడు వెబ్ సిరీస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సిరీస్ లో అసభ్యత, లైంగిక దాడులు, బూతు భాష వంటివి దారుణంగా ఉన్నాయని ఓటీటీ వినియోగదారులు చెబుతున్నారు. ఈ సిరీస్ ను తాము ఇంటిల్లిపాది కలిసి చూడలేనిదని పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి కంటెంట్ సిరీస్ లను ఓటీటీ వీక్షకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రానా నాయుడు సిరీస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది.