Pavitranath: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అతడిని గుర్తు చేసుకుంటూ.. ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేం ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించికోలేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.
ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తినివ్వాలని ఎమోషనల్ అయ్యారు. అయితే అతను ఎందుకు? ఎలా? చనిపోయాడో వివరాలు తెలియదు. బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలిరేకులు సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని పాత్రలను కూడా ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అయితే ఇందులో దయ పాత్రలో పవిత్రనాథ్ నటించారు. చాలా కాలంగా ఇతను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.