Om Bheem Bush Movie Review: ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉందంటే?
సమాజవరగమన చిత్రంతో కామెడీ పంచిన శ్రీవిష్ణు మళ్లీ అదే స్థాయిలో కామెడీ ఉంటుందంటూ విపరీతంగా ప్రచారాలు చేసిన తాజా సినిమా ఓం భీమ్ బుష్ థియేటర్లోకి వచ్చేసింది. మరీ ఈ చిత్రం ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
చిత్రం: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యర్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు సినిమాటోగ్రాఫర్: రాజ్ తోట సంగీతం: సన్నీ ఎమ్ఆర్ ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి ఎడిటర్: విజయ్ వర్ధన్ నిర్మాత: వి సెల్యులాయిడ్, సునిల్ బలుసు డైరెక్టర్: శ్రీ హర్ష కొనగంటి విడుదల: 22-03-2024
డీసెంట్ హీరో శ్రీవిష్ణు, కామెడీ స్టార్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. ఈ వారం థియేటర్లో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రచార చిత్రాలతో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
లెగసీ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులు బ్యాంగ్ బ్రదర్స్ క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్ రామకృష్ణ) మంచి ఫ్రెండ్స్. కాలేజీలో వీళ్ల పనులను భరించలేక ఇంకా సమయం ఉన్నప్పటికీ ముగ్గురికీ డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు ప్రొఫెసర్. పట్టాలు సాధించిన వీరు భైరవపురంలో సైంటిస్టుల అవతారమెత్తుతారు. ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో ఓ ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తామని ప్రచారం చేసుకుంటారు. అలా గడిచిపోతున్న కొంత కాలం తరువాత వీరు నిజమైన సైంటిస్టులు కాదని, ఊరి జనాల్ని మోసం చేస్తున్నారనే విషయం బయట తెలుస్తుంది. దాంతో ఊరి సర్పంచ్ ఓ పరీక్ష పెడతాడు. సంపంగి మహల్లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే నిజమైన సైంటిస్టులని నమ్ముతామని అంటాడు. దెయ్యం ఉన్న ఆ మహల్లోకి నిధి కోసం వెళ్లాక ఈ బ్యాంగ్ బ్రదర్స్ పరిస్థితి ఏంటి? వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ సంపంగి దెయ్యం కథేంటి? వీళ్లకు నిధి దొరికిందా? అనేది తెరమీద చూడాలి.
ఎలా ఉందంటే:
ఓం భీమ్ బుష్.. నో లాజిక్ ఓన్లీ మేజిక్ అనేది ఉపశీర్షిక. దీనికి తగ్గట్టుగానే సినిమా మొత్తం ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. ఓ ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్రయాణం ఈ సినిమా. దీనికి తోడు హారర్ కామెడీ, ఓ కాన్సెప్ట్‌ని రాసుకున్నారు. దెయ్యాలు, ఆత్మలు అనే కాన్సెప్ట్ ఇది వరకు చూసిందే అయినా ఇందులో వీళ్లదైన కామెడీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా బ్యాంగ్ బ్రదర్స్ చేసే పనులు హైలెట్, కాలేజీ సీన్లు చాలా బాగుంటాయి. ఆ తర్వాత భైరవపురం ఊళ్లో ఎ టు జెడ్ సర్వీసెస్ మొదలయ్యాక అసలు సిసలు హంగామా మొదలు అవుతుంది. విలేజ్‌లో ముగ్గురూ చేసే క్రేజీ పనులు నవ్విస్తాయి.
సెకాండ్ ఆఫ్ అంతా సంపంగి మహల్లోనే సాగుతుంది. సంపంగి దెయ్యం రాహుల్ రామకృష్ణనీ, ప్రియదర్శినీ భయపెట్టే సన్నివేశాల్లో పండిన హారర్, కామెడీ సినిమాకు హైలెట్. సంపంగి దెయ్యం కథతోపాటు, పతాక సన్నివేశాల్లో ఎల్.జి.బి.టి అంశాన్ని టచ్ చేసిన తీరు మెప్పిస్తుంది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైమింగ్ వల్ల వన్ లైనర్స్ బాగా పేలాయి. కథ పరంగా క్లైమాక్స్ మెప్పిస్తుంది. కామెడీ పరంగా సినిమా అంతా మెప్పిస్తుంది.
దర్శకుడు పనితీరు మెప్పిస్తుంది. ఎక్కడ లాజిక్‌లు వెతకొద్దు అని ముందే చెప్పాడు కాబట్టి సినిమా ఆద్యాంతం ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కించారు. కెమెరా, సంగీతం, ఎడిటింగ్, ఆర్ట్ అన్ని అంశాల్లో మంచి ఔట్పుట్ వచ్చింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్లు
కామెడీ
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటన
క్లైమాక్స్