ప్రస్తుతం 'నా సామిరంగ' అనే సినిమా చేస్తున్నాడు కింగ్ నాగార్జున. మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా అంజిగాడి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ఈ చిత్రాన్ని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, డైలాగులు అందిస్తున్నాడు. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతోంది నా సామిరంగ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్గా ‘ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే’ అనే సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
నాంది సినిమాతో యూ టర్న్ తీసుకున్న అల్లరి నరేష్.. ప్రస్తుతం సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మధ్య మధ్యలో ఇతర హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున నా సామిరంగ సినిమాలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో అల్లరోడు అంజిగాడు అనే పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా అల్లరి నరేష్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు ఉదయం 10 గంటల18 నిమిషాలకి అంజిగాడు వస్తున్నాడు.. నా సామిరంగ అంటూ అనౌన్స్ చేశారు. మా అంజి గాడిని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటొచ్చెత్తాది.. అంటూ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో అల్లరి నరేష్ లుంగీ కట్టుకోని కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. మరి అల్లరోడు నాగ్‌తో కలిసి ఎలా అలరిస్తాడో చూడాలి.