Manchu Lakshmi: రాజకీయాల్లోకి మంచు లక్ష్మీ? ముగ్గురు మూడు పార్టీల్లో?
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. ఇక ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.
అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా నటించిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సినిమాలే కాకుండా సమాజ సేవ కూడా చేస్తోంది లక్ష్మీ. 2014లో టీచ్ ఫర్ ఛేంజ్‌ను స్థాపించి.. ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్నఈ సంస్థ.. ఇటీవల ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.
గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్న లక్ష్మీ.. ఈ ఏడాది టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా.. గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది. ఇలా సినిమాలు, సమాజ సేవతో బిజీగా ఉన్న లక్ష్మీ.. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. పీఎం ఆఫీస్ నుంచి లక్ష్మీ ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. రేపే లక్ష్మీ ఢిల్లీకి పయనమవుతుందని.. బీజెపి కండువా కప్పుకోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే.. ఒక్క మంచు ఫ్యామిలీలోనే మూడు పార్టీల పోరు ఖాయం.
ఒకప్పుడు టీడీపీలో ఉన్న మోహన్ బాబు.. ఇప్పుడు వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. విష్ణు కూడా తండ్రి పార్టీలోనే ఉన్నాడు. కానీ మంచు మనోజ్ మాత్రం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెబుతున్నారు.