Devil Movie Review: కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్టా? ఫట్టా?
బింబిసార తరువాత అదే స్థాయిలో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్న చిత్రం డెవిల్. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) బింబిసార తరువాత మంచి కథలను ఎంచుకుంటున్నారు. దానిలో భాగంగా అమిగోస్ చిత్రంతో వచ్చిన అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కథ డెవిల్తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. డెవిల్ సెటప్, బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
భారతదేశంలో బ్రిటిష్ పాలనా నేపథ్యంలో1945 లో ఈ కథ జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనేక రకాల ప్రణాళికలు వేస్తుంటారు. అదే సమయంలో బోస్ ఇండియాలో అడుగుపెడుతున్నారని, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్ సైన్యం అనుకుంటుంంది. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్యకు గురవుతుంది. ఈ హత్య కేసులో విజయ తండ్రి జమీందారును అరెస్ట్ చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్(Devil) (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ అనుమానిస్తాడు. అసలు ఈ కేసుకు, బోస్‌కు సంబంధం ఏంటి? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? సముద్ర (వశిష్ట), షఫీ (షఫీ) పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
డెవిల్(Devil) కథ, కథనాలు కొత్తగా అనిపించవు. కానీ సెటప్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవడం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి బ్యాగ్‌డ్రాఫ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను యాడ్ చేయడం ఆకట్టుకుంది. ఈ కేసు దర్యాప్తులో రివీల్ అయ్యే ఒక్కో పాయింట్ ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి కథను ఇంకా ఆసక్తిగా తెరకెక్కించొచ్చు అనిపిస్తుంది. మాములుగా ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని చూసేలా ఉండాలి. కానీ ఈ డెవిల్ సినిమాను పూర్తిగా రిలాక్స్ అవుతూ చూస్తుంటారు. నెమ్మదిగా కథ సాగుతుంటుంది. ఇది కచ్చితంగా దర్శకుడి లోపమే అని చెప్పాలి.
క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోదు. బ్రిటీష్ సైన్యాన్ని కళ్యాణ్ రామ్ ఊచకోత కోస్తుంటే మళ్లీ రొటీన్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏదో ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సస్పెన్స్‌ను కంటిన్యూ చేయడంలో విఫలం అయ్యారు అనిపిస్తుంది. దీనికి తోడు పాటలు అడ్డుపడుతాయి. ద్వితీయార్దంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్వీస్ట్ ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో సినిమా పూర్తి కమర్షియల్‌గా అనిపిస్తుంది.
ఎలా చేశారు:
కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు విభిన్న షేడ్స్‌లో అద్భుతంగా మెప్పించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్ చాలా బాగా చేశాడు. మాళవిక నాయర్ పాత్ర ఆకట్టుకుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపిస్తుంది. యాక్టింగ్ చేసే స్కోప్ పెద్దగా లేదు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక విభాగం:
ఫస్ట్ హాఫ్‌లో హర్షవర్దన్ ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. కానీ సెకండ్ ఆఫ్‌లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. చిత్రానికి ముఖ్యమైన బలం సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్. ఆయన కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ మెప్పిస్తుంది. అభిషేక్ నామా దర్శకుడిగా తడబడ్డాడు అని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.