మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
చిత్రం: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, రావు రమేష్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: నాగవంశీ, ఎస్. రాధా కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
P. S. వినోద్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల: 12 జనవరి 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుము విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
గుంటూరులో హీరో నాన్న సత్యం(జయరామ్)కు మిర్చి యాడ్స్ ఉంటాయి. ఆయన వ్యాపార శత్రువు అయిన జగపతిబాబు తన యాడ్స్‌ని తగలబెడుతాడు. ఆ గొడవలో జగపతిబాబు అన్న సునిల్ చనిపోతాడు. ఆ నేరం సత్యం మీద పడుతుంది. ఆ సమయంలో తన కొడుకు రమణ(మహేష్ బాబు)ను విడిచి తన తండ్రి వైరా వెంకట సూర్యానారాయణ (ప్రకాష్ రాజ్) దగ్గరకిి వసుంధర వెళ్లాల్సి వస్తుంది. మరో పెళ్లి చేసుకొని పార్టీలో చేరి మంత్రి అవుతుంది. తనకు ఒక కొడుకు ఉంటాడు. అతన్ని ఎంపీ చేయాలనేది సూర్యానారాయణ కల. దాని కోసం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రమణకు, తన తల్లి వసుంధరకు ఎలాంటి సంబంధం లేదని ఓ సంతకం కోసం ఫోన్ చేస్తారు. ఇక రమణ సంతకం చేశాడా? కొడుకును వదిలి వసుంధర ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనికి ముఖ్య సూత్రదారి ఎవరు? వసుంధరను పొలిటికల్‌గా డీఫేమ్ చేయడానికి కాటా మధు(రవి శంకర్) ఏం చేస్తాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? కుటుంబంలో ఉన్న ఈ మొత్తం చిక్కుల్ని రమణ ఎలా ఎదుర్కొన్నాడు అనేది గుంటూరు కారం కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభ సన్నివేశాలను చూస్తే కథలో చాలా ఎమోషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఫ్యాన్స్ పండుగ చేసుకునే మహేష్ బాబు ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉండడం కొంత నిరాశే అని చెప్పాలి. కథలో మెయిన్ థీమ్ తల్లీ కొడుకుల సెంటిమెంటే కాబట్టి ఆ సన్నీవేశాల కోసం మొదటి నుంచి చాలా సెటప్ చేశారు. కానీ పే ఆఫ్ ఇవ్వడంలో అంత వర్క్ అవుట్ కాలేదు. వసుంధర తన కొడుకును ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందో చెప్పే సీన్లు బలంగా లేవు. నిజానికి వసుంధర క్యారెక్టర్‌కు చాలా వెయిట్ ఉంది. దాన్ని తెరపై చూపించడంలో గురూజి లెక్క తప్పింది. పంచుల ప్రసాలతో ఈలలు, చప్పట్లు కొట్టించ వచ్చు కానీ భావోద్వేగం పండించాలంటే సరైనా సీన్లు పడాల్సిందే. అదే మిస్ అయింది. హీరోయిన్ శ్రీలలను గ్లామరస్‌గా చూపించారు. ఫస్ట్ ఆఫ్‌లో మ్యాషప్ సాంగ్స్కిి, క్లైమాక్స్‌లో కుర్చీ సాంగ్‌కి డ్యాన్స్ కుమ్మేసింది. కానీ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేని పాత్ర. ఓల్డ్ కాన్సెప్ట్.. హీరోతో సంతకం చేయించడానికి గుంటూరు వచ్చి నానా పాట్లు పడుతుంది.
సెకండ్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఎందుకు నటించింది అంటే అంత తొందరగా సమాధానం చెప్పలేము. ఏదో నటించింది అంతే. త్రివిక్రమ్ సినిమా క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయో తెలిసిందే. హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాల్లో కంటతడి పెట్టే సంభాషణలు. అవేవి ఈ సినిమాలో వర్క్ అవుట్ కాలేదు. వసుంధర, రమణ మాట్లాడుకుంటే చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు నిరాశే మిగిలుతుంది. చాలా చిన్న చిన్న డైలాగ్‌లతో క్లైమాక్స్ తేల్చేశారు. తల్లి లేక రమణ పడిన వేదన, కొడుకును దూరం చేసుకొని వసుంధర చేస్తున్న యుద్ధం తాలూకు ఎమోషన్ మిస్ అవడం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారు:
మహేష్ బాబు యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏం ఉంటుంది. ఎమోషనల్ సీన్లలో, కామిడీ టైమింగ్‌లో, పంచులు చెప్పడంలో ఆయనకు సెపరేటు రూట్ ఉంది. ఈ సినిమాలో గుంటూరు యాస కూడా కలిసొచ్చింది. జయరాజ్ తనకు అలవాటు అయిన ఎప్పుడూ సంఘర్షనలో ఉండే పాత్రే ఇందులో చేశారు. రమ్యకృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ స్క్రీన్ స్పేస్ తక్కువుంది. ప్రకాశ్ రాజ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడంలో ఆయన్ను కొట్టేవారు లేరు. ఇందులో కూడా అదే పాత్ర. ఈశ్వరీ రావు, వెన్నెల కిశోర్, జగపతి బాబు, మీనాక్షీ చౌదరి మిగితా నటీనటులు వారిపాత్రల మేరకు ఓకే అనిపించుకున్నారు.
సాంకేతిక అంశాలు:
త్రివిక్రమ్ మార్క్ ప్రాసలు, పంచ్ డైలాగ్‌లు ఉన్నాయి కానీ ఆయన తాలూకు మ్యాజిక్ మిస్ అయింది. తమన్ బీజీఎమ్ కొన్ని పోర్షన్స్ లో బాగుంది. మరికొన్ని చోట్ల ఏదో ఉంది అన్నట్లు ఉంది. అందరూ నెగిటీవ్ చేసిన కుర్చిని మడత పెట్టి సాంగ్ థియేటర్లో కూడా అదిరిపోయింది. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్తా పని పెట్టుంటే బాగుండేది. సినిమాటోగ్రఫి పర్లేదు.