ఇవ్వాళ రేపూ స్టార్స్ ఎందుకు కొన్ని విషయాలు మాట్లాడతారో, మళ్ళీ ఎందుకు నాలిక్కరుచుకుంటారో అర్ధం కాదు. హై ఫోకస్లో ఉన్న స్టార్స్ మేల్ ఆర్ ఫిమేల్ మాట్లాడేదానికి విపరీతమైన బజ్ ఆటోమేటిక్‌గా వచ్చెస్తుంది. అది వాళ్ళ ఇమేజ్కున్న పవర్. కొన్ని సందర్భాలలో వాళ్ళు అది మర్చిపోయి,ఏదో హైలో నోటికొచ్చింది వాగేస్తుంటారు. తర్వాత సోషల్ మీడియాలో రియాక్షన్స్ చూసి భయపడిపోతారు, అప్పుడు మళ్ళీ సంజాయిషీలు, క్షమాపణల పర్వం మొదలవుతుంది. ఈ మధ్యన ఈ లొల్లి ఎక్కువైపోతోంది.
కాజోల్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇటీవల కాజోల్ రామోజీ ఫిల్మ్ సిటీ మీద చేసిన అనుచితమైన కామెంట్లు ప్రపంచమంతా కాక రేపాయి. లేనిపోని మాటలాడి ఈ బాలీవుడ్ అమ్మడు అనవసరమైన రొంపిలో చిక్కుకుపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీ హాంటెడ్ ప్లేస్ అని ఏదో ఇంటర్వ్యూలో నోరు పారేసుకుంది. అక్కడ వైబ్రేషన్స్ అస్సలు బాగులేవని, దెయ్యాలు తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేసిందని అవాకులు చవాకులు పేలింది. దెబ్బకి సోషల్ మీడియాలో అందరూ ఆమె మీద అలాఇలా విరుచుకు పడలేదు. దాంతో కాజోల్ భయపడిపోయింది. దెయ్యాల కన్నా సోషల్ మీడియానే ఎక్కువ భయపెట్టింది కాజోల్ ని.
నేను అలా అనలేదని, రామోజీ ఫిల్మ్ సిటీ చాలా గొప్ప సందర్శనా స్థలమని, అంత ప్రొఫెషనల్ షూటింగ్ లొకేషన్ మరొకటి లేదని, ప్రపంచం నలుమూలల నుంచి ఫిల్మ్ సిటీకి వేలాది మంది వస్తుంటారని, అదే దాని గొప్పతనమని మళ్ళీ సద్ది చెప్పుకుంది. కాజోల్ నోట మాట రాగానే అనేకమంది మొదలెట్టారు. వాళ్ళ అనుభవాలు చెప్పడం, షేర్ చెయ్యడం ప్రారంభమైంది. అది పులి అంటే అదిగో తోక అన్నట్టుగా కాజోల్ మాటలు అందరినీ రేపెట్టాయి. లోకులు కాకులు అన్న సామెతకి అద్దం పడుతూ ఒక్కొక్కరి అనుభవాలతో ఓ పిచ్చివాతావరణం అలుముకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఒక సుందర స్వాప్నికుడు హృదయవైశాల్యాన్ని చాటి చెబుతుంది. రామోజీరావు అనే ప్రకృతి ప్రేమికుడు, సినీకళాప్రియుడు ఎన్నో ఏళ్ల కలఫలితం రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడే బాహుబలి, కల్కి వంటి వరల్డ్ ఫేమస్ ఫిల్మ్స్ తయారయ్యాయి.
ఇప్పుడు పారెన్ కొలాబరేషన్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆసియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్‌ని బాలీవుడ్‌వారు నిర్మిస్తున్నారు, అయితే ఓ వర్గం ఏమంటున్నారంటే, హైదరాబాద్ బాలీవుడ్‌ని తలదన్నే విధంగా ఎదిగిపోతోంది, హాలీవుడ్ కూడా ఇక్కడ షూటింగ్‌లు చేయడానికి సిద్దమైపోతున్న దరిమిలా హైదరాబాద్ గొప్పతనాన్ని దెబ్బకొట్టడానికే కాజోల్ చేత ఎవరో మాట్లాడించారనే ప్రచారం కూడా జరుగుతోంది.