US President : బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా తొలగించాలంటూ కమలా హారిస్‌కు అభ్యర్థన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు, జ్ఞాపక శక్తి విషయంలో ఆ దేశంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ కోరారు.
US President removal demand : అమెరికా అధ్యక్షుడిగా ఉన్న 81 ఏళ్ల జో బైడెన్‌పై ఆ దేశంలో ఎప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. వయసు మీద పడటంతో ఆయన జ్ఞాపక శక్తి విషయంలోనూ వారిలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి ఓ అధికారి లేఖ రాశారు. వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే ఈ విషయాన్ని ఆమెకు అభ్యర్థించారు.
ప్రస్తుతం అమెరికాకు మానసికంగా గట్టిగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాట్రిక్ ఆ లేఖలో రాసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో బైడెన్(Joe Biden) పలు ప్రసంగాల్లో తడబాటుకు గురవుతూ వస్తున్నారు. బహిరంగ సభల్లో, విదేశీ నేతలతో మాట్లాడేప్పుడు పేర్లను కొన్ని సార్లు తప్పుగా పలుకుతున్నారు. ఆయన జ్ఞాపక శక్తి విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన సామర్థ్యాలు అధ్యక్ష పదవిని సవ్యంగా నిర్వర్తించడానికి అనువుగా లేవన్నారు.
1965లో కాంగ్రెస్ 25వ సవరణకు ఆమోదం తెలింది. ఈ సవరణ ప్రకారం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మానసికంగా, శారీరంగా ఫిట్‌గా లేరని భావిస్తే వైస్ ప్రెసిడెంట్, క్యాబినేట్ సభ్యులు ఆయనను తొలగించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ సవరణకు ఇప్పుడు ప్రాధాన్యతను ఇస్తూ బైడెన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పాట్రిక్ నివేదించారు. అన్ని విధాలుగా ఫిట్‌గా ఉన్న వ్యక్తి అమెరికాకు అవసరం అని ఆయన అభిప్రాయ పడ్డారు.