»The Us Government Has Proposed Changes To The H 1b Visa It Has Decided To Change The Qualifications And Provide Better Facilities For Foreign Workers And F 1 Student Visas
H-1B వీసాలో మార్పులు.. భారతీయులపై ప్రభావం పడనుందా?
అమెరికా సర్కార్ హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను మార్చడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది.
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ(H-1B) వీసాలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతల్లో మార్పులు చేయడంతో పాటు వాళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. నాన్ ఇమ్మిగ్రెంట్(వలసేతర) వర్కర్స్కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసె స్(యూఎస్సీఐఎస్) అధికారులు ఫెడరల్ రిజిస్టర్లో ఈనెల 23న ప్రచురించనున్నారు. ప్రతి ఏడాది జారీ చేసే 60వేల వీసాల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదని అమెరికా సర్కార్ తెలిపింది.
అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1 బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు బైడెన్ సర్కారు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రతిపాదనలపై పెట్టుబడిదారులు, ప్రజలు, ఆయా సంస్థల యజమానులు తమ అభిప్రాయం చెప్పాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కోరింది.
హెచ్-1బీ వీసాల్లో చేసిన మార్పులు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంకా డాక్యుమెంట్లు ఇవ్వడం, పనిచేసే ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శించడం వంటి మార్పులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. హెచ్-1బీ వీసా కోరుకునే భారతీయులకు చట్టబద్ధమైన ఉపాధిని పొందే క్రమంలో ఎలాంటి నకిలీలకు అవకాశం లేకుండా చూసేందుకే ఈ మార్పులు చేసినట్లు అమెరికా సర్కార్ వెల్లడించింది.