»The Desire To Study At The Age Of 65 The Old Man Joined The 1st Class
Pakistan: 65 ఏళ్ల వయసులో చదువుకోవాలనే కోరిక..1వ తరగతిలో చేరిన వృద్ధుడు!
ఓ 65 ఏళ్ల పెద్దాయన చదువుకోవాలనుకున్నాడు. లేటు వయసులో ఆయన 1వ తరగతిలో జాయిన్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలనుకునే కలను ఇప్పుడు నెరవేర్చుకోవడంతో అందరూ ఆయన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.
చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే చాలా మందికి ఆర్థిక సమస్య వల్లనో, కుటుంబ సమస్యల వల్లనో, లేకుంటే కొన్ని కారణాల వల్లనో వారు తమ చదువును కొనసాగించలేరు. అయితే కొందరు మాత్రం వయసు పెరిగినా చదువుకోవాలనుకునే తమ కలను నెరవేర్చుకుంటుంటారు. తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రిటైర్డ్ కావాల్సిన వయసులో ఓ వ్యక్తి చదువుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆ వ్యక్తి 65 ఏళ్ల వయసులో 1వ తరగతిలో చేరాడు. చిన్నారుల మధ్య కూర్చోని అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ ఘటన పాకిస్తాన్ (Pakistan)లో చోటుచేసుకుంది.
దిలావర్ ఖాన్ (Dilavar Khan) అనే వ్యక్తి పాక్ లోని ఖైబర్ పాఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఉండేవాడు. ఈ మధ్యనే ఆయన తన సమీపంలోని ఒకటో తరగతిలో చేరాడు. ఇంత వయసులో ఆయన 1వ తరగతి చదవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దిలావర్ ఖాన్ చిన్నతనంలో ఉండగా తనపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. అందుకే చదువుకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని ఇప్పటి వరకూ నిరక్షరాస్యుడిగానే గడిపాడు.
చదవడానికి వయసుతో సంబంధం లేదని నమ్మే దిలావర్ ఖాన్ (Dilavar Khan) ఈ లేటు వయసులో తీరిక దొరకడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. అందుకే మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. స్థానిక పాఠశాలలో చేరాడు. స్కూల్ యాజమాన్యం కూడా ఆయన్ని స్వాగతించింది. ప్రస్తుతం దిలావర్ ఖాన్ స్కూలు చిన్నారులతో కలిసి చదువకుంటున్నాడు. ఆయన్ని చూసి పలువురు స్ఫూర్తి పొందుతున్నారు.