»Supreme Court In The Adani Hindenburg Dispute The Supreme Court Issued A Key Verdict
Supreme Court: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం
అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని సుప్రీం పేర్కొంది.
Supreme Court: అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును అనుమానించలేమని ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది. సెబీ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరించింది. కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని సుప్రీం పేర్కొంది. అయితే హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తిచేసింది.
మిగతా రెండు కేసులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే షార్టింగ్ విషయంలో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిందా? లేదా? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. థర్డ్ పార్టీ నివేదిక, వార్తా పత్రికలు ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని తెలిపింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి ఆధారాలు లేవని కోర్డు తీర్పునిచ్చింది.
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనివల్ల అదానీ షేర్లు కూడా తగ్గాయి. అయితే దీనిపై దాఖలైన పలు పిటిషన్లలను విచారించిన సుప్రీంకోర్టు నాలుగు పిటిషన్లపై తీర్పును వెలువరించింది. దీనిపై అదానీ స్పందిస్తూ.. చివరకు సత్యమే గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.