Nepal : నేపాల్‌లో కారుప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని మారుమూల ప్రాంతంలో కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Nepal : నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని మారుమూల ప్రాంతంలో మంగళవారం కారు(Car) లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి, బీహార్(Bihar) రిజిస్ట్రేషన్‌తో ఐదుగురు భారతీయ పౌరులతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని సింధులి జిల్లా(Sindhuli District)లో రోడ్డు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న లోయలో పడింది. మృతి చెందిన వారంతా పురుషులే. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సిల్వాల్ తెలిపారు. గాయపడిన ఓ ప్రయాణికుడిని సింధూలి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని కూడా తదుపరి చికిత్స కోసం ధులిఖేల్ ఆసుపత్రి(Dhulikhel Hospital)కి తరలించారు. దట్టమైన, లోతు ఎక్కువ ఉండడంతో ప్రమాద స్థలం నుండి మృతుల మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు.
సమస్తిపూర్ జిల్లా, కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. మృతుల్లో ఒకరు మృత్యుంజయ్ కుమార్ సింగ్, కళ్యాణ్పూర్ పిఎస్(Kalyanpur PS) పరిధిలోకి వచ్చే ఫుల్హరా గ్రామానికి చెందినవాడు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అతని కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సమస్తిపూర్, పాట్నాలోని పోలీసులు.. బాధితుల గుర్తింపును నిర్ధారించలేకపోయారు. అయితే నేపాల్ నుండి వచ్చిన నివేదికలు ఇతర బాధితులు కూడా సమస్తిపూర్(Samastipur)నివాసితులే అని సూచించాయి.