Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం ప్రజలను భయపెట్టింది. బాగ్మతి, గండకి ప్రావిన్స్‌లలో ఉదయం 7:39 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్(NSC) తెలిపింది. ఖాట్మండుకు పశ్చిమాన 55కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. 13కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో ఢిల్లీలో కొన్ని సెకన్లు పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అక్టోబర్ 16న నేపాల్‌లోని సుదుర్పాశ్చిమ్ ప్రావిన్స్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. తక్కువ రోజుల్లోనే మళ్లీ భూకంపం సంభవించింది. టిబెటన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న ప్రదేశం వల్ల నేపాల్‌లో భూకంపం సాధారణమే. ప్రతి శతాబ్దానికి ఈ ప్లేట్లు ఒకదానికొకటి రెండు మీటర్లు దగ్గరగా కదిలి.. ఒత్తిడిని సృష్టిస్తాయి. తర్వాత భూకంపాలు ఏర్పడతాయి. పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్(PDNA) ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది.