»Earthquake Scared Again People Ran From Their Houses
Nepal Earthquake: మళ్లీ భయపెట్టిన భూకంపం..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
నేపాల్ ప్రజలను మళ్లీ భూకంపం వణికించింది. రెండు రోజుల క్రితం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం మరోసారి నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భారత్ పొరుగు దేశమైన నేపాల్‌ను మరోసారి భూకంపం (Nepal Earthquake) భయపెట్టింది. తాజాగా మంగళవారం ఉదయం నేపాల్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology ) ప్రకటించింది.
నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu) సమీపంలో భూకంపం వాటిళ్లింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మరోవైపు వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేడు సంభవించిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. అక్టోబర్ తొలివారంలో కూడా నేపాల్ దేశంలో వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి.
నేడు కేవలం అరగంట వ్యవధిలోనే ఐదుసార్లు భూమి కంపించిందని, పలుమార్లు స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. ఇకపోతే నేపాల్‌లో ఆదివారం కూడా భూమి కంపించింది. ఆ రోజు భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైందని, ఖాట్మండుకు పశ్చిమ దిశలో 55 కిలోమీటర్ల దూరంలోని ధాడింగ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరోమారు నేడు భూమి కంపించడంతో నేపాల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.