శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 632 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
సెంట్రల్ మొరాకోలో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం వచ్చింది. 6.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తీవ్రతతో సుమారు 632 మంది మరణించగా.. 329 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని అధికారులు ఇంకా తేల్చలేదు.
శుక్రవారం రాత్రి 11:11 గంటలకు భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ వణుకు చాలా సెకన్ల పాటు వచ్చిందని తెలిపింది. మరోవైపు మొరాకో నేషనల్ సీస్మిక్ అలర్ట్ నెట్వర్క్ ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతగా నమోదైంది. ఆ క్రమంలోనే మరో 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ ఏజెన్సీ చెప్పింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్లు దిగువన ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు చాలా అరుదుగా వస్తాయి. గతంలో 1960లో అగాడిర్ సమీపంలో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి.