Sleepcation : బిజీ బిజీ జీవితాల్లో ఇప్పుడు స్లీపకేషన్ అనే కొత్త ట్రెండు మొదలయ్యింది. బాగా నిద్ర పోవడానికి వెకేషన్‌కి వెళ్లడం అన్నమాట. నిద్ర లేమి సమస్యలతో బాధపడే వారు మిగిలిన వారితో పోలిస్తే చాలా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. అందు వల్ల వీరికి గుండెకు సంబంధించిన సమస్యలూ ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో ఇలా ప్రశాంతంగా వెకేషన్‌కి వెళ్లి నిద్ర పోవాలని కలలుగంటున్నారు. అలా తమ ఒత్తిడిని తగ్గించుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఆరోగ్యం దృష్టితో చూసుకున్నప్పుడు ఇదీ మంచి ట్రెండే అని వైద్యులు చెబుతున్నారు.
నిజానికి ఇలా నిద్ర పోయేందుకు వేరే చోటికి వెళ్లడం అనే అలవాటు అమెరికా, కెనడా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మారుతున్న జీవన విధానం వల్ల ఇప్పుడది ఇలా భారత దేశానికీ పాకింది. అందుకనే ఈ మధ్య ఇన్‌స్టాగ్రాంలు, ఫేస్‌బుక్‌ల్లో వెకేషన్లో చక్కగా నిద్రపోతున్న వారి ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. వాటిని పట్టుకుని స్నేహితులు, ఫాలోవర్లు ఆట పట్టిస్తూ కామెంట్లు పెట్టుకుంటూ ఆనందిస్తున్నారు.
పనుల ఒత్తిడిలో తలమునకలైన వారు, చిన్న పిల్లల్ని పెంచుతున్న వారు, నిద్ర లేమితో చాలా రోజులుగా బాధ పడుతున్న వారు ఎక్కువగా ఈ స్లీపకేషన్లకు(Sleepcations) వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓ నాలుగైదు రోజుల పాటు రోజు వారీ జీవితానికి భిన్నంగా దూరంగా గడిపి వస్తున్నారు. అక్కడ నచ్చినప్పుడు తిని, ఇష్టమైనంత సేపు నిద్రపోయి ఫుల్ ఎనర్జటిక్‌గా, ఎంతో రిలాక్సింగ్‌గా వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇలా గడపడం వల్ల మానసికంగా వారు మరింత బలంగా మారతారని ఇది మంచి పరిణామమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.