Curd : తెలుగు వారిళ్లలో చాలా మంది భోజనంలో కచ్చితంగా పెరుగు తింటారు. అయితే కొందరికి మాత్రం దీన్ని తినడం ఎందుకో పెద్దగా నచ్చదు. అయితే దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే ప్యాకెట్లు, యోగర్ట్లు కాకుండా ఇంట్లో చక్కగా దీన్ని తయారు చేసుకుని తినడం మంచిదంటున్నారు. అందువల్ల దీనితో వచ్చే మంచి ప్రయోజనాలను(Benefits) ఎక్కువగా పొందేందుకు వీలవుతుందని సూచిస్తున్నారు.
రోజుకు వంద గ్రాముల పెరుగు తినడం వల్ల 61 క్యాలరీలు, 4.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.4 గ్రాముల ప్రొటీన్, 3.3 గ్రాముల కొవ్వు మనకు లభిస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడే వారు పెరుగన్నం తినడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడతాయి. దీనిలో ఉండే ప్రో బయోటిక్ లక్షణాలు పేగులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంటే దీనిలో బతికి ఉన్న మంచి సూక్ష్మ జీవులు ఉంటాయి. ఇవి తిన్న ఆహారం నుంచి శరీరం సక్రమంగా పోషకాలను శోషించుకునేందుకు సహకరిస్తాయి.
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేసేందుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ మన శరీరానికి వ్యాధులను కలిగించే జీవులతో పోరాడతాయి. తద్వారా మనల్ని వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. రక్తంలో చక్కర స్థాయిలు ఎక్కువ కాకుండా చూస్తుంది. దీనిలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం వల్ల రక్తపోటూ నియంత్రణలో ఉంటుంది. చర్మం, జట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగును రోజూ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ శక్తివంతం అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీనిలో దొరికే కాల్షియం వల్ల ఎముకలూ దృఢంగా ఉంటాయి. దంతాలు, పళ్లు బలంగా మారతాయి. ఎదిగే పిల్లలకు ఇది మంచి బలాన్ని అందిస్తుంది. వారు పళ్లు, ఎముకలు బలంగా ఉండేలా చూస్తుంది. దీనిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.