ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆరోగ్యకరంగా భోజనం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎక్కువగా నూనెల్లో వేపించినవి, కార్బోహైడ్రేట్లు లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఆహారం తినడం విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తామో, తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. భోజనం పూర్తయిన తర్వాత అస్సలు ఈ పనులు చేయవద్దని అంటున్నారు. మరి ఆ పనులేంటో తెలుసుకుందాం రండి.
భోజనం(Meals) చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఆహరం జీర్ణం కావడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అదే ఆ సమయంలో స్నానం చేస్తే రక్త ప్రసరణ అటువైపు మళ్లుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహకరిస్తుంది. దీంతో ఆహారం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. అందువల్ల అజీర్తి, చర్మ అలర్జీల్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత పండ్లు తినకూడదు. అలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతారు. కడుపు నిండా తిన్నాక మళ్లీ పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఓ రకంగా బరువు పెరగడానికీ ఇది కారణం అవుతుంది. అలాగే చాలా మందికి తిన్నాక పడుకునే అలవాటు ఉంటుంది. అలా చేస్తే కొవ్వులు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతాయి. బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధిత సమస్యలూ వస్తాయి. అందుకే భోజనం చేశాక పడుకోవడం కన్నా నడవడం మంచిది.