»Us Census Bureau Report That Telugu Population Has Increased 4 Times In The Last Eight Years
America : అమెరికాలో నాలుగింతలు పెరిగిన తెలుగువారు!
అమెరికాలో తెలుగు వారు అంతకంతకూ పెరుగుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగింతలు తెలుగువారి జనాభా పెరిగినట్లు యూఎస్ సెన్సస్ బ్యూరో చెబుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Us Census Bureau Report : అవకాశాలను వెతుక్కుంటూ మన దేశం నుంచి పొరుగు దేశాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఏటా లక్షల సంఖ్యలో జనం ఇలా పొరుగు దేశాలను తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మాత్రం మనవాళ్లు భారీగా పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు వారి సంఖ్య గత ఎనిమిదేళ్లలో భారీగా పెరిగింది. ఇదే విషయాన్ని అక్కడి యూఎస్ సెన్సెస్ బ్యూరో రిపోర్ట్(Us Census Bureau Report) చెబుతోంది. 2016లో అమెరికాలో మొత్తం 3.2 లక్షల మంది తెలుగు వారు ఉండేవారు. 2024 సంవత్సరం వచ్చే సరికి ఆ సంఖ్య 12.3లక్షలకు చేరుకుంది.
అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నట్లైతే రెండు లక్షల మంది కాలిఫోర్నియాలో, 1.5లక్షల మంది టెక్సాస్‌లో, 1.1లక్షల మంది న్యూజెర్సీలో, 83 వేల మంది ఇల్లినాయిస్లో, 78వేల మంది వర్జీనియాలో 52 వేల మంది జార్జియాలో తెలుగు వారు(Telugu Population) ఉన్నారు. వీరిలో దాదాపుగా పది వేల మందికి హెచ్1బీ వీసాలు ఉన్నాయి.
ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకి(America ) వెళుతున్నారు. అలా వెళ్లిన వారిలో దాదాపుగా 75 శాతం మంది అక్కడే స్థిరపడుతున్నారని అమెరికా తెలుగు సంఘం మాజీ కార్యదర్శి అశోక్ చెప్పుకొచ్చారు. తెలుగు వారంతా ఎక్కువగా డాలస్, నార్త్ కరోలినా, బే ఏరియా, అట్లాంటా, న్యూజెర్సీ, ఫ్లోరిడా, నాష్ విల్లే లాంటి చోట్లే ఉంటారని అన్నారు. అమెరికాలో 350 రకాల విదేశీ భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారిలో అత్యధికంగా ఉన్న వారిలో 11వ స్థానంలో తెలుగు వారు(Telugu Population) ఉన్నారు.