»Youll Miss Out On These Advantages If You Peel The Appleyoull Miss Out On These Advantages If You Peel The Apple
Apple Peel : యాపిల్ తొక్క తీసేసి తింటున్నారా? ఇదోసారి చదవండి!
ఇటీవల కాలంలో చాలా మంది యాపిల్ తొక్కని పీల్ చేసుకుని తింటున్నారు. అయితే ఆ తొక్కలోనే బోలెడు పోషకాలు నిండి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి యాపిల్ని తొక్కతో పాటే ఎలా తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చేయండి.
Benefits Of Apple Peel : వైద్యుడికి దూరంగా ఉండాలంటే రోజూ ఒక యాపిల్ తినాలనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆంగ్ల సామెత. అందుకనే చాలా మంది తరచుగా యాపిల్ పండ్లను తింటూ ఉంటారు. అయితే రసాయనాలు ఉంటాయనో, మైనం పూత ఉంటుందనో భయం వల్ల చాలా మంది తొక్కను తీసేసి ఈ పండును తింటున్నారు. ఆ భయంలో నిజం లేకపోలేదు. అయితే తొక్కలోనూ బోలెడు పోషకాలు ఉంటాయి. అవి లోపలికి వెళ్లాలంటే ఆరోగ్యవంతంగా తొక్కతో ఆపిల్‌ని తినాలి. అదెలాగంటే?
యాపిల్(apple) పండ్ల మీద రసాయనాలు, మైనం పొర లాంటివి తొలగిపోవాలంటే.. ఓ పని చేయాలి. బజారు నుంచి వీటిని తెచ్చుకున్న వెంటనే ఓ సారి శుభ్రంగా కడగండి. తర్వాత గోరు వెచ్చటి నీటిని తీసుకోండి. అందులో కాస్త రాళ్ల ఉప్పు, స్పూను బేకింగ్ సోడాలను వేయండి. అవి కరిగాక ఆ నీటిలో యాపిల్స్‌ని వేయండి. అలా అరగంట వదిలేయండి. తర్వాత మళ్లీ ఓసారి మంచి నీటితో కడిగి భద్రపరుచుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని ఎలాంటి సందేహం లేకుండా తొక్కతో సహా తినేయవచ్చు.
యాపిల్ తొక్కల్లో(apple peel) పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి హృదయ కణాలను పరిరక్షిస్తాయి. వీటిలో పొటాషియం సైతం ఎక్కువగా ఉంటుంది. ఇది హైబీపీ(High BP) రాకుండా చూస్తుంది. అలాగే యాపిల్ తొక్కల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఆకలి వేయనీయదు. ఫలితంగా మనం అధికంగా తినకుండా ఉంటాం. బరువు పెరగకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. అలాగే మధుమేహం లాంటివి సైతం రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ యాపిల్ తొక్కలు సహకరిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, గుండెలకు అనేక వ్యాధులు రాకుండా ఇవి కాపాడతాయి. అందుకనే యాపిల్ని ఎప్పుడూ తొక్కతోనే తినాలి. తినే ముందు పైన చెప్పిన విధంగా శుభ్రపరుచుకోవడం మాత్రం తప్పని సరి.