Tulsi Water Daily : భారతీయ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకనే దాదాపుగా అందరి ఇళ్లల్లోనూ ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. ఇంత తేలికగా లభ్యమయ్యే ఈ ఆకులతో చేసుకున్న నీటిని తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు వీటిని రోజూ తాగుతామంటారు. మరింకెందుకు ఆలస్యం? అవేంటో తెలుసుకుందాం రండి.
ఓ పది తులసి(Tulsi) దళాలను తీసుకుని రాత్రి పూట నీటిలో వేసేయండి. ఉదయం అయ్యాక ఆ నీటిని తాగండి. లేదా కొన్ని తులసాకులను తీసుకుని నీరు పోసి మరగకాచి టీలా కూడా తాగవచ్చు. ఇలా తులసి నీరు చేసుకుని తాగడం వల్ల వివిధ వ్యాధులను తగ్గించుకోవచ్చు. కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ, ఉదర సంబంధమైన సమస్యలు, ఒత్తిడిని తగ్గించడం లాంటి వాటికి తులసి నీళ్లు చక్కగా పని చేస్తాయి. ప్రధానంగా మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇవి కీలకంగా పని చేస్తాయి.
తులసి నీరు(Tulsi Water) వివిధ ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, అపానవాయువులను తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. దగ్గు, కఫం, ఉబ్బసం లాంటి శ్వాస కోశ సమస్యలు దూరం అవుతాయి. దీనిలో ఉన్న యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల నోటి ఇన్ఫెక్షన్ల లాంటివి రాకుండా ఉంటాయి. ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారతాయి.